ఆంథోనీ ఆల్బానిసీ నేతృత్వంలోని లేబర్ పార్టీ పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ విజయం ద్వారా ఆయన మళ్లీ ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈసారి లేబర్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో భారీ మద్దతు లభించింది. ముఖ్యంగా క్వీన్‌స్లాండ్‌లోని డిక్సన్ నియోజకవర్గం నుంచి లేబర్ అభ్యర్థి ఆలీ ఫ్రాన్స్ విజయం సాధించడంతో ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ తన సీటును కోల్పోయారు. ఇది ఆస్ట్రేలియా రాజకీయ చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచింది — ఫెడరల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు తన సీటు కోల్పోవడం ఇదే తొలిసారి.
సిడ్నీలోని లేబర్ పార్టీ విజయోత్సవ సభలో ప్రసంగించిన ఆంథోనీ ఆల్బానిసీ, “ప్రధానిగా సేవ చేయడం నా జీవితంలో అత్యంత గౌరవమైన విషయం,” అని భావోద్వేగంగా అన్నారు. “ఈ రోజు ఆస్ట్రేలియా ప్రజలు సమానత్వానికి, అవకాశాలకు, ఆశయాలకు ఓటేశారు. మేము కలలు కంటున్న, కలలు నెరవేర్చే భవిష్యత్తుకు మద్దతు తెలిపారు,” అని పేర్కొన్నారు.
లేబర్ విజయం నేపథ్యంలో, పీటర్ డట్టన్ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. “ఈ ప్రచారంలో మేము సరైన రీతిలో పని చేయలేకపోయాము. అది స్పష్టంగా తెలిసిందని,” చెప్పారు. “దేశానికి మంచి జరగాలని ఎప్పుడూ కోరుకున్నాను. లేబర్ పార్టీకి ఇది చారిత్రక ఘట్టం, మేము దాన్ని గౌరవిస్తున్నాము,” అని అన్నారు.
ఆల్బానిసీ ఈ ఎన్నికల సందర్భంగా పలు కీలక హామీలను ప్రకటించారు. మొదటి ఇల్లు కొనే వారికి కేవలం 5 శాతం డిపాజిట్‌తో స్వంత ఇంటి కల నెరవేర్చేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 100,000 కొత్త ఇల్లు నిర్మించేందుకు $10 బిలియన్, మెడికేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి $8.5 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా, సోలార్ ఎనర్జీ నిల్వకు గృహ వినియోగదారులకు బ్యాటరీల కొనుగోలుపై $2.3 బిలియన్ సబ్సిడీ ప్రకటించారు. సూపర్‌మార్కెట్లలో అధిక ధరలపై నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.