కృత్రిమ వాతావరణంలో పెరుగుతున్న పరిపక్వతలేని పిల్లల మానసిక స్థితిని ఆ చిత్రం విశ్లేషించింది. సీన్ కట్ చేస్తే, 2024 పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం నేటి బాలలకు కృత్రిమ మేథని చేతికందిస్తొంది.ఆ సాంకేతిక విజ్ఞానాన్ని అర్థం చేసుకుని, సరైన పద్దతిలో ఉపయోగించే, మానసిక పరిపక్వత వారికి ఉందో, లేదో అటు తల్లితండ్రులు గాని, ఇటు సమాజం గాని గుర్తించే ప్రయత్నం చేయట్లేదు.
పర్యవసానం, 12, 15 ఏళ్లలోపు మెల్బోర్న్ కు చెందిన స్కూలు స్టూడెంట్స్ అశ్లీల, అసభ్య పదజాలంతో తోటి విద్యార్థినులపైనా, మహిళపైనా వ్యాఖ్యలు చేసి సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి, మిస్ యూసివర్స్ ఆస్ట్రేలియాకు టాగ్ చేసారు. యారా వాలీకి చెందిన 11వ తరగతికి చెందిన విద్యార్థులు, తమ తోటి విద్యార్థునులకు, వారి ఆకర్షణ, అందం బట్టి చాలా అసభ్యకరంగా ర్యాంకులిచ్చి పోస్ట్ లు పెట్టారు. మెల్బోర్న్కు చెందిన స్కూలు విద్యార్థినులు ‘హిజాబ్’ ధరించిన ఒక ముస్లిం బాలికపై జాతివివక్షతను చూపి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో సిడ్నీకి చెందిన ఒక స్కూలు స్టూడెంట్ తమ స్కూలుకి చెందిన 50 మంది విద్యార్థినుల ఫోటోలను కృత్రిమ మేథ ద్వారా నగ్నచిత్రాలుగా మల్చి సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశాడు.
అమ్మ, నాన్న లేకపోయినా పర్వాలేదు గాని పోన్లు, ఇంటర్నెట్ లేకపోతే బతకలేమనే స్థితికి నేటి యువత చేరుకుంటున్నారు. ఇది వినడానికి అతిశయోక్తిగా అనిపించవచ్చుగాని, నేడు మనందరం ఒప్పుకుతీరవల్సిన నిజం. 3 నుంచి 17 ఏళ్లలోపు వయసుగల పిల్లలో 68శాతం మంది వారంలో 21 గంటల 48నిమిషాలపాటు అంటే దాదాపు ఒక రోజు, 10 ఏళ్లలోపు పిల్లలు వారానికి 15 గంటలు ఫోన్లపై తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని డెలాయిట్ ఆస్ట్రేలియా జరిపిన ఒక అధ్యయనంలో పేర్కోంది. ఒక్క కృత్రిమ మేధ (ఎఐ)కు సంబంధించిన వెబ్ సైట్ల, యాప్ వినియోగం గత సంత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి 18 శాతం పెరిగినట్టు ఇంటరాక్టివ్ అడ్వటైజింగ్ బ్యూరో (ఐఎబి) సంస్థ తెలిపింది.
నేటి యువత వేస్తున్న ఈ తప్పటడుగులకు ఎవరు బాధ్యులు? పిన్నవయస్సులోనే వారి చేతల్లో స్మార్ట్ ఫోన్లు పెడుతున్న తల్లి, తండ్రులా? ప్రైమరీ స్కూలుకు చెందిన 6 నుంచి 10 ఏళ్ల వయస్సులో ఉన్న స్టూడెంట్స్ కు ఆధునిక విజ్ఞానం పేరుతో కంప్యూటర్లను అందిస్తున్న మన విద్యా వ్యవస్థదా? ఇదే విషయాన్ని విశ్లేషిస్తూ, ఇప్పటికే దేశంలో కొన్ని స్కూళ్లు మొబైల్ ఫోన్స్ ని క్లాసు రూముల్లో నిషేదించారని, కాని దాని వల్ల పెద్ద ప్రయోజనం కన్పించట్లేదని, కేవలం నిషేధం ద్వారా విద్యార్థుల ఆలోచనా సరళిలో మార్పులు తేవడం సులువు కాదని శ్రీమతి వాణి సంబార గారు అభిప్రాయపడ్డారు.
వాణిగారు గత ముప్పై రెండు సంవ్సతరాలుగా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో ఉపాధ్యాయురాలిగా హ్యుమానిట్సీ మరియు లాంగ్వేజ్స్, గిఫ్టెడ్ అండ్ టాలెంట్డె, స్పెషల్ నీడ్స్ శాఖలకు ఆయా విద్యాసంస్థలలో హెడ్ ఆఫ్ ది డిపార్టెమంట్ గా వ్యవహరించటంతోపాటుగా పాఠ్య ప్రణాళికలను రూపొందించటంలో కృషి సలిపారు. అలాగే ఈ సంవత్సరం పశ్చిమ ఆస్ట్రేలియాలో 11, 12వ తరగతులకు మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న ఏటార్ హిందీ సబ్జక్ట్ పాఠ్యాంశాలను కూడా వాణిగారు రూపోందించారు.
SBS తెలుగుతో ఆవిడ మాట్లాడుతూ, విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పట్ల, సామజిక సమస్యల పట్ల సరైన అవగాహన కల్పించటంలో తల్లి,తండ్రులు, స్కూలు యాజమాన్యం కీలకపాత్ర పోషిస్తారని, యువతను సరైన దారిలో పెట్టడంలో ఇరు పక్షాలు బాధ్యత వహించాలని అన్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.