ఇళ్ల సగటు ధర గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు రియల్ ఎస్టేట్ ఇన్స్టిస్టూట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. గత సంవత్సరం మార్చితో పోలిస్తే, ఈ 12 నెలలో ఒక ఇంటి సగటు ధర 13.6 శాతం పెరిగి, నేడు ఇది రికార్డ్ స్థాయిలో 625,000 డాలర్లకు చేరుకుందని ఈ నివేదిక తెలుపుతోంది.
పెర్త్ లో పెరుగుతున్న అద్దెలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుదలకు దోహదపడుతోన్నాయి. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 నాటికి ఇంటి అద్దెలు 8.3 శాతం పెరిగి, నేడు ఒక ఇంటి అద్దె వారానికి సగటున 650 డాలర్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 18.2 శాతం ఎక్కువ. పెరుగుతున్న అద్దెలు, సరఫరా కంటె ఇళ్ల డిమాండ్ ఎక్కువగా ఉండటం ఇళ్ల ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఇంత గణనీయంగా ఇంటి ధరలు పెరుగుతున్నప్పటికి, దేశంలో మిగిలిన ముఖ్య పట్టణాలతో పోలిస్తే, పెర్త్ లో ఇళ్ల అద్దెలు, ఇళ్ల ఖరీదు కూడా తక్కువే. ఎంతో వేగవంతంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతున్నప్పటికి ఫిబ్రవరి 2021 నాటితో పోలిస్తే, డిసెంబర్ 2023లో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల సంఖ్య, సగానికి సగం మాత్రమేనని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటస్టిక్స్ తెలిపింది. ఫిబ్రవరి 2021లో 2692 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తే, ఈ సంఖ్య డిసెంబర్ 2023లో కేవలం 1296. ఇళ్ల నిర్మాణంలో తగ్గుదల కూడా ప్రస్తుత రియల్ ఎస్టేట్ డిమాండ్ కు ఒక కారణం కావచ్చు. ఇదే అభిప్రాయాన్ని, ఎన్రిచ్ ప్రాపర్టీ ఇన్వెస్టర్స్ వ్యవస్థాపకులు, రాజ్ మొత్తూరు గారు ఎస్బిఎస్ తో మాట్లాడిన సందర్భంగా వ్యక్తపరిచారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని మిగిలిన పట్టణాలతో చూస్తే, రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెర్త్ చాలా వెనకబడిపోయిందన్నారు. సిడ్ని, మెల్బోర్న్ వంటి పట్టణాలలో ఇప్పుడు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి ఇల్లు కొన్నా, దానిపై వచ్చే అద్దెలు 500 డాలర్లుకు మించి రావట్లేదు. దాంతో వారు పెట్టుబడి పెట్టడానికి ఇతర పెర్త్ వంటి ఇతర పట్టణాలపై దృష్టిసారిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు పెర్త్ ని ఆస్ట్రేలియాలో ఒక భాగంగా కూడా చూసేవారు కాదు. దాంతో, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఉత్సాహం చూపేవారు కాదు. కానీ, కోవిడ్ తర్వాత ఈ స్థితిలో మార్పు వచ్చి పెర్త్ పుంజుకోవడం ప్రారంభించిందని అని ఆయన తెలిపారు.
ఈ పెరుగుదల మరో రెండు, మూడు ఏళ్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని రాజ్ మొత్తూరు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధానం కారణం ఇళ్ల కొరతగా ఆయన చెపుతున్నారు. ఇదివరలో పెర్త్ లో కనీసం 18 నుంచి 20 వేల ఇళ్లు అమ్మకానికి ఉండేవి. కానీ నేడు ఈ సంఖ్య కేవలం 2500-3000 వరకు ఉంది. అదేవిధంగా, అద్దెకు కూడా ఇళ్లు దొరకని పరిస్థితి కన్పిస్తోంది. అందువల్ల, ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రజలు ఇళ్లు కొనడానికి ఉత్సాహం కనపరుస్తున్నారు. దీంతోపాటు పెర్త్ లో నివసించడానికి వస్తున్న వలసదారుల సంఖ్య పెరగటంతో కూడా ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. గత సంవత్సరం 70వేల దాకా వలసదారులు రాగా, ఈ సంవత్సరం 80వేల మంది వరకు రావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన మరింత ఒత్తిడి రావచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా, గత రెండేళ్లతో పోలిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి ఇళ్లపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కొంత తగ్గినప్పటికీ, స్థానికులు ఇళ్ల కొనుగోళ్లపై ఉత్సాహం కనపరస్తున్నారన్నారు.
అయితే, అతితక్కువ కాలంలోనే మార్కెట్ వృద్ధి చెందకుండా నెమ్మదిగా పెరిగి ఉండుంటే, మరికొన్నేళ్లపాటు పెర్త్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత నిలకడగా, పటిష్టంగా తయ్యారయ్యే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలోనే ఇళ్ల ధరలు పెరిగి చుక్కలనంటుకున్నాయి. అయినప్పట్టికీ, ఇంకా పెరుగదలకు అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు ప్రధాన కారణం, అన్ని ప్రాంతాలలో ఎదుగుదల ఒకే విధంగా ఉండకపోవడం. స్కూళ్లు, రవాణా వసతులు అధికంగా ఉన్న ప్రాంతాలలో వృద్ధి మొదలైందని, ఇది క్రమేణా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు.
అయితే, ప్రస్తుతం ఉన్న డిమాండ్ కు తగ్గ వనరులు లేకపోవడం కొంత ఇబ్బందిని కల్గించే అవకాశం లేకపోలేదని, అందువల్ల ఇళ్లపై పెట్టుబడులు పెట్టేవారు, ఇళ్లను నిర్మించడం కంటే, ఇప్పటికే ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల పెరుగుదల మెరుగయ్యే అవకాశం ఉందని రాజ్ మొత్తూరు సూచించారు. కాగా, రియల్ ఎస్టేట్ వృద్ధి అనేది, ఒక చక్రభ్రమణమని, ప్రతి నాలుగు, ఐదేళ్లకు ఒకసారి మార్కెట్ లో హెచ్చుతగ్గులు, మార్పులు సంభవిస్తాయని ఆయన అన్నారు. కాని, గత పదేళ్లుగా పెర్త్ మార్కెట్ ఎటువంటి పెరుగుదలను చూడకపోవడం వల్ల నేడు ఆ పెరుగుదలంతా ఒక్కసారిగా వచ్చి పెర్త్ మార్కెట్ ‘సూపర్ సైకిల్’ స్థాయికి చేర్చిందని, ఇక పెర్త్ మార్కెటుకు భవిష్కత్తులో ఎటువంటి ఢోకా ఉండబోదన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి, పెర్త్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలదొక్కుకుని నిలబడే స్థాయిని చేరుకుందని చెప్పారు.
ఇల్లు అమ్మకానికి పెట్టిన పదిరోజులలోనే కొనుగోలుదారులు ఎగరేసుకుపోతున్నారంటే, పెర్త్ లో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. చక్కటి వాతావరణం, వస్తువులు అందుబాటు ధరలలో లభించటం, విలువైన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న మౌళిక సదుపాయాలు, పటిష్టమైన ఆర్థిక రంగం ఇవన్నీ పెర్త్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు బలం చేకూర్చాయి. ఇంక రాబోయే కాలంలో పెర్త్ కూడా సిడ్నీ, మెల్బోర్న్ వంటి పట్టణాలకు ధీటైన పట్టణంగా మారనుంది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.